కొండమీద బావుల రహస్యం
తిరుమల చరితతిరుమల శ్రీనివాసుని ఆలయంలో ఈనాటికీ రెండు బావులు వున్నాయి. ఒకటి
విమాన ప్రాకారంలోవున్న బంగారుబావి. రెండవది సంపంగి ప్రాకారంలో వున్న
పూలబావి
పూలబావి వృత్తాంతం వరాహపురాణం రెండవ భాగంలో వస్తుంది. ఈ కథకు,
భగవంతుడు శంఖచక్రాలు ధరించకుండా వుండే కథకు దగ్గర సంబంధం.
కలియుగారంభంలో తొండమానుచక్రవర్తి శేషాచలం ఆ చుట్టుప్రక్కల వున్న
తొండదేశాన్ని పరిపాలిస్తూ వుండేవాడు. ఈయన పరమ భాగవతుడు, శ్రీనివాసుని
ఆంతరంగిక భక్తుడు. శ్రీనివాసునికి ఆలయంకట్టించి, చాలా మహోత్సవాలు
ప్రారంభించి సక్రమంగా జరిపించిన వాడు ఇతడే. ప్రతిరోజూ స్వామిని
వేంకటాచలంలో దర్శించుకోవాలన్న ఆకాంక్ష తీర్చడానికి స్వామి అతనికి అహోబిలం
నుండి వేంకటాచలానికి వున్న సొరంగమార్గ (బిలం) రహస్యం చెప్పి తొండమానునికి
రోజూ తన దర్శనం చేసుకోవడానికి సావకాశం కల్పిస్తాడు.
బ్రహ్మపురాణంలో ఈ తొండమానుని సామంత రాజులు అతనిపై వ్యతిరేకించి,
అందరూ కలిసి అతనిపై యుద్ధానికి వచ్చి, అతని సైన్యాన్ని జయించినట్లు, అప్పుడు
తొండమానుడు బలముచాలక భయంతో తన రాజ్యానికి వచ్చి నృసింహబిలాన్ని చేరి
నరసింహునిపూజించి సొరంగమార్గం ద్వారా దేవేరులతో కలిసి విహరిస్తున్న
శ్రీనివాసుని వద్దకు - అది, వెళ్లకూడని సమయమైనా వెళ్తాడు.
సమయంకాని సమయంలో అలావచ్చిన రాజుని, భగవంతునితో విహరిస్తున్న
యిద్దరు దేవేరులు చూచి, శ్రీదేవి శ్రీనివాసుని వక్షస్థలంలో వున్న వైజయంతిమాల
వెనుక సూక్ష్మ రూపియై దాక్కొంది. భూదేవి దగ్గరలోవున్న బావిలోకి దూకింది. భూదేవి
కదా కనుక ఆమె భూమిలోకి బావిద్వారా వెళ్లిందని తెలియాలి. రామానుజుల కాలంలో
ఈ కథ చాలా ప్రసిద్ధిలోవుండేదట. ఇతర పురాణాలలో కూడా ఈ కథ చెప్పబడింది.
కాని, కల్ప భేదం వలన కథలో కొంచెం మార్పు కనపడుతుంది.
బ్రహ్మాండ పురాణంలో శత్రువుల చేతిలో పరాభవం జరిగి తొండమానుడు
వచ్చినట్లు చెప్పబడింది. కాని వరాహ పురాణంలో వీరశర్మ అనే బ్రాహ్మణుడి వృత్తాంతం
చెప్పేటప్పుడు ఈ కథ చెప్పబడింది.
వీరశర్మ తన భార్యను రాజు సంరక్షణలో వదలి తీర్థయాత్రకు వెళ్లాడు.
ఆ బ్రాహ్మణుడు తిరిగి వచ్చిన సమయానికి అతని భార్య మరణించింది. ఆ వృత్తాంతం,
బ్రాహ్మణునికి చెప్పకుండా రాజు కలతతో శ్రీనివాసుని కలవడానికి సొరంగం ద్వారా
రాకూడని సమయంలో వస్తాడు. అలా ఎందుకు రాకూడని సమయంలో వచ్చావని
శ్రీనివాసుడు రాజుని ప్రశ్నిస్తే, భయంతో బ్రాహ్మణుడి భార్య చనిపోయిన
వృత్తాంతం చెప్పి, ఆమెను బ్రతికించి అనుగ్రహించమని వేడుకుంటాడు. అలా
అసందర్భంగా వచ్చిన రాజుని చూచి దేవేరులు దాక్కొంటారు.
పురాణాలలో భూతీర్థంగా చ్పెబడే ఈబావిలోకి భూదేవి వెళ్లిన కారణంగా,
శ్రీరామానుజులు ఆ బావిలో భగవంతుడిని అర్చారూపిగా వుంచి. శ్రీనివాసునికి
సమర్పించిన తులసి, పూమాలలు, భూదేవి కొరకు బావిలో వుంచాలని
నియమంచేశారని వేంకటేశ్వర యితిహాసమాలలో చెప్పబడింది. అలా ప్రతిరోజూ
శ్రీనివాసుని పుష్పమాలలు అందులోవేస్తారు కనుక ఆ బావికి 'పూలబావి' అని పేరు.
ఈ బావి తిరుమల ఆలయంలో సంపంగి ప్రదక్షిణలో ఈశాన్యం మూల పోటు
మండపానికి దగ్గర పిండివంటలు (లడ్డూ, వడ వగైరా) చేసే వంటశాల దగ్గర వుంది
దీనికి భూ తీర్థమని పేరుకూడా వుంది. ఇంకొక బావి విమానప్రాకారంలోని
బంగారుబావి.
అందుకే తిరుమల కొండపై మానవులెవ్వరూ పూలు ధరించే సంప్రదాయంలేదు.
భగవంతుని నిర్మాల్యమైన పూలుకూడా బావిలోనే వేస్తారు కాని స్త్రీలకు యివ్వడం కాని,
ఎవరైనా ధరించే సంప్రదాయంకాని లేదు. ఈ మధ్య ఒక దశాబ్ద కాలంవరకు ఈ
నియమం పాటించబడుతూ వుండేది. ఈ మధ్య కాలంలో తిరుమల వీథులలో
పూలమ్మడం చూస్తున్నాము. అమ్ముతారు కనక, కొనేవారుంటారు. తెలియదు కనుక
వాటిని అలంకరించుకొనే స్త్రీలుంటారు. దేవస్థానం వారు ఈ విషయంలో కట్టడిచేస్తే
బాగుంటుంది. విషయం తెలుసుకొని స్త్రీలు పురుషులు (పూలు దొరికినా) వాటిని
అలంకరించుకోకుండా వుండటం కొండపైన మంచిది.

Comments
Post a Comment