సుప్రభాతంలో తెర వెనకాల ఏం చేస్తారు?

   సుప్రభాత సేవ సమయంలో భక్తుల్ని బంగారువాకిలి ముందు నిలబెట్టి, ఆ వాకిలికి తెరవేసేసి, అలా కొంతసేపు వుంచేస్తారు. ఆ సమయంలో తెరవెనకాల గర్భాలయంలోఏం జరుగుతుంది. అన్నది భక్తులకి ఉత్కంఠ కలిగించే విషయం. 

అక్కడ ఏం జరుగుతుందంటే...


సుప్రభాత సేవను విశ్వరూపసేవ అనికూడా అంటారు.

తెల్లవారు జామున సుప్రభాత సేవ జరగడానికి ముందు గొల్ల మిరాశీదారు వెళ్లి అర్చకులను లేపడం, తర్వాత జియ్యంగారిని లేపడం, దివిటీలతో వారిని ఆలయానికి తీసుకురావడం సంప్రదాయం. ఆలయ అధికారులు, పూర్వకాలంలో పారుపత్తేదారు, ఇప్పుడు ఆలయం పేష్కారు (సహాయ కార్యనిర్వహణాధికారి) అయినాఈ సమయానికి ఆలయానికి రావాలి. అర్చకులు, ముఖ్యంగా గుడికి రాకముందే స్నానాదులు ముగించి, తమ కర్మానుష్ఠానం చేసిన తర్వాతే, ఆలయానికి రావాలన్నది నియమం. అదే నియమం జియ్యంగార్ల విషయంలో కూడా. ఎందుకంటే వీరిద్దరూ గర్భాలయంలోకి వెళ్లే అవసరంవుంది. వారిలో అర్చకునికే స్వామివారిని ముట్టే అవకాశం ఉంటుంది.

జియ్యంగారు లేదా వారి తరఫున ఏకాంగులకు గర్భాలయంలోకి వెళ్లే అధికారమున్నా, వారికి స్వామి వారిని తాకే హక్కులేదు. ఆలయ అధికారులు, కావల్సిన దిట్టం (పూజకు కావాల్సిన సరంజామా) లెక్కప్రకారం ఇచ్చారా లేదా? దాని నాణ్యత ఉండాల్సిన రీతిగా ఉందా లేదా? అన్నది చూడాల్సిన బాధ్యత జియ్యంగారిది. ఆ పూజాద్రవ్యాలను తమ చేతుల మీదుగా అర్చకులకు అందజేయడం, అలా అందజేసిన

వాటిని అర్చకులు సక్రమంగా వాడుతున్నారా లేదా చూడటం కూడా వారి బాధ్యతే. ఈనాడు మనం సుప్రభాత సేవకు వెళ్తే, అందరినీ బంగారు వాకిలివద్ద ఆస్థాన మండపంలో ముందు ఉంచుతారు. పూర్వకాలంలో ముందు అర్చకులు, జియ్యంగారుగాని ఆయన ఏకాంగికాని, గొల్ల మిరాశీదారు, ఆలయ అధికారులు, బయట మహాద్వారం తలుపుల సీళ్లు పరిశీలించి తీయించడం, తరువాత వెండివాకిలి తెరిపించడం, ఆ తర్వాత ఆస్థాన మండపం తలుపులు తీయించడం జరుగుతాయి. ప్రస్తుత కాలంలో మహాద్వారం, వెండి వాకిలి మూసే సంప్రదాయం జరగడం లేదు.

సీళ్లు వేసి మూసేది బంగారు వాకిలి మాత్రమే. వేదపండితులు, ఇతర ఆలయ అధికారులు, భద్రతా సిబ్బంది వారివారి స్థానాలలో చేరిన తర్వాత, సుప్రభాత సేవాదారులను గుడిలోపలికి ప్రవేశింపచేస్తారు. అప్పటికే వేదపండితులు, అన్నమయ్య వారసులు, అర్చకులు బంగారు వాకిలి దగ్గరచేరి ఉంటారు. తాళాలతో గొల్ల సిద్ధంగా ఉంటాడు. అలా భక్తులు గుమిగూడిన తర్వాత అందరి సమక్షంలో రాత్రివేసిన సీళ్లను పరిశీలించి, తాళాలతో ఆలయం తలుపులు తీసి లోనికి అర్చకులు,జియ్యంగారు,గొల్ల వెళతారు.

     పూర్వకాలంలో భక్తులను, వేదపండితులను కూడా లోపలికి పంపేవారట. కొన్ని శతాబ్దాల క్రితం ఇలా పంపడం ఆపివేశారు. అన్నమయ్య వంశస్థులు లోపలికి వెళ్లి పాటలు పాడుతుంటే నృత్యం చేసేవారు నృత్యం, వేదం చదివేవారు వేదం చదువుతుంటే స్వామి వారికి మేల్కొలుపు జరిగేదట. ఆ సంప్రదాయంలో మార్పు వచ్చింది. ఇప్పుడు బంగారు వాకిలి తలుపులు తీసి, గొల్ల, అర్చకులు, జియ్యంగార్లు లోపలికి వెళ్లాక తలుపులు మూసేస్తారు. వేదపండితులు స్వామివారి సంస్కృత సుప్రభాతం గానం చేస్తారు. అప్పుడే అన్నమయ్య వారసులు కూడా బంగారు వాకిలివద్ద అన్నమయ్య కీర్తనలు గానం చేసే విధానం కూడా ఉంది. అందరూ బంగారు వాకిలిబయటనే ఉంటారు. ఇలా సుప్రభాత గానం జరుగుతున్నప్పుడు, లోపల అర్చకులు, జియ్యంగార్లు దీపాలు సరిచేసి, కొత్త దీపాలు వెలిగించి, స్వామివారి దోమతెర తొలగించి,తూగుటుయ్యాల పై పవ్వళించిన స్వామిని మేల్కొల్పి, ఆ భోగశ్రీనివాసుని స్నపనమండపం నుండి గర్భగృహంలోని జీవస్థానానికి చేరుస్తారు. స్వామివారి పరుపు, మంచాలను గొల్ల బయటకు తెచ్చేస్తాడు. స్వామివారికి ఆవు పాలు, వెన్న నైవేద్యం చేసి, కర్పూర హారతి ఇచ్చిన తర్వాత బంగారు వాకిలి తలుపులు తెరుస్తారు. అప్పటికి సుప్రభాతగానం పూర్తయి ఉంటుంది. అప్పుడు భక్తులందరినీ దర్శనానికి పంపుతారు. ఇక్కడ జరిగేవి రెండు సేవలు.

  మొదటిది, మేలుకొలుపు సేవ, రెండవది విశ్వరూప సేవ. ఈ విశ్వరూప సేవ -బ్రహ్మ దేవుడు రాత్రి సమయంలో స్వామిని అర్చించి వెళ్లిన తర్వాత, భక్తులు చేసే దర్శన సేవ. అప్పుడు ఇచ్చే తీర్థం బ్రహ్మచేసిన స్వామివారి పాదోదక అభిషేక తీర్థం.

  కొంత కాలం క్రితం వరకు ఇలా ఉదయం ఈ దర్శనానికి వచ్చే భక్తులకు స్వామివారి తీర్థం, చందనం కొంచెం ఇచ్చే సంప్రదాయం ఉండేది. రాత్రి ఏకాంత సేవకు ముందు ఒక గంధం ముద్ద భోగశ్రీనివాసుని వక్ష్మస్థలంలోనూ, కొంచెం గంధం ధ్రువబేరం పైనఉన్న అమ్మవారి పైన పెడతారు. ఇంకొంచెం గంధం పూజాద్రవ్యాలతోపాటు ఒక పళ్లెంలోనూ, ఐదు బంగారు పాత్రలలో శుద్ధమైన నీరూ, బ్రహ్మదేవుడు అర్చించడానికి

వీలుగా ఉంచుతారు. ఇవికాక స్వామివారి పాదాలపై బంగారు తొడుగులు తీసి రెండుపాదాలపై రెండు గంధం ముద్దలు ఉంచి, వాటిపై చిన్న పాద వస్త్రాలు ఉంచుతారు.

విశ్వరూప దర్శనానికి వచ్చిన భక్తులకు, ఈ రాత్రి బ్రహ్మదేవుడు నివేదించిన గంధం కొంచెం కొంచెం ఇచ్చి, స్వామివారి పాదవస్త్రాలను కంటికి అద్దుకోవడానికి ఇచ్చేవారు.

ఇప్పుడు చాలా అరుదుగా పెద్ద వి.ఐ.పి. లు వస్తే ఇస్తారేమోగాని, అందరికీ ఇచ్చే అవకాశం లేదు. మనకు దొరికిన చారిత్రక ఆధారాలను బట్టి చూస్తే, ఈ సుప్రభాత సేవా పద్ధతి ప్రాచీనకాలం నుండి ఉన్నట్లుగా అనిపించడంలేదు.

15వ శతాబ్దం మధ్యలో మొదలైనట్లు తెలుస్తోంది. ఇప్పుడు గానం చేస్తున్న సుప్రభాతం రచించిన ప్రతివాది భయంకర అణ్ణన్ అనే ఆయన దీనిని 14వ శతాబ్దం చివరలో గానీ, 15వ శతాబ్దం మొదటలోగాని రచించినట్లు తెలుస్తోంది. అన్నమయ్య  కాలంలో అన్నమయ్య స్వామివారి ముందు సుప్రభాత సమయంలో, ఏకాంత సమయంలో గానం చేసేవాడని చెప్పవచ్చు.

ఈ 15 వ శతాబ్దానికి ముందు కాలంలో సుప్రభాత సేవ ఎలా జరిగేదో తెలిపే

ఆధారాలు కనపడటం లేదు. సుప్రభాతం 15వ శతాబ్దంలో రచించి గానం చేయడానికి

ముందు వేదపారాయణం జరిగేదేమో అనుకుందామంటే,  వీర ప్రతాపదేవరాయ

మహారాయలు 1430 ADలోనే, అది వరకు వుండి తర్వాత కాలంలో ఆగిపోయిన

వేదపారాయణానికి మళ్లి ఏర్పాటు చేశాడు.

దానికి దేవదేయంగా శ్రీనివాస మంగాపురం

(ఇప్పుడు కళ్యాణ వేంకటేశ్వర ఆలయం వున్న చంద్రగిరి దగ్గరి ఊరు) లోని సగం

ఆదాయాన్ని, నెలకు ఇద్దరు వేదపండితుల లెక్కన 12 నెలలూ పారాయణానికిగాను చేశాడు.

శ్రీరంగంలోని శ్రీరంగనాథుల విగ్రహాలు ముస్లిం దండయాత్ర కాలంలో, తిరుమల ఆలయంలో ఉన్న సమయంలో శ్రీరంగనాథునికి 'తిరుపళ్లి ఎకుచ్చి' (స్వామివారిని పొగడుతూ పాడే సంప్రదాయం) ఉండి ఉండాలి. దాన్ని చూచి తర్వాత కాలంలో

  శ్రీనివాసునికి ఈ సుప్రభాతం సంస్కృతంలో రాయించే ఏర్పాట్లు జరిగి ఉండాలి.

అలా సుప్రభాతగానంతో కొంత కాలం జరిగాక, 16వ శతాబ్దంలో అన్నమయ్య

కీర్తనలు కూడా తెలుగులో పాడే సంప్రదాయం ప్రవేశపెట్టబడింది. ఆ పద్ధతే ఇప్పటికీ కొనసాగుతోంది.




Comments

Popular posts from this blog

ఎక్కడిదీ భగవద్గీత, ఎలా పుట్టింది, అసలు మనం ఏ సంవత్సరంలో ఉన్నాం?

తల్లిని మించిన దైవం, గాయత్రిని మించిన దైవం ఎవరు లేరా? గాయత్రి దేవి అంటే ఎవరు..?

లక్ష్మీ కటాక్షం లభించాలంటే ఇలా చేయండి