★ ఇది కదా ప్రగతి.. పల్లెల పురోగతి ★ మన పల్లెలు తెలంగాణ ప్రగతి కొమ్మలు.. రూపురేఖలు మారిపోయిన పంచాయతీలు

 ★ ఇది కదా ప్రగతి.. పల్లెల పురోగతి 


★ మన పల్లెలు తెలంగాణ ప్రగతి కొమ్మలు.. 

     రూపురేఖలు మారిపోయిన పంచాయతీలు


★ పరుచుకొన్న పచ్చదనం.. 

     పరిశుభ్రంగా పల్లెదనం.. 

     దేశంలో ఎక్కడాలేని మౌలిక సదుపాయాలు


★ దేశంలో టాప్‌ 20లో 19 గ్రామాలు మనవే.. 

     అన్ని రంగాల్లోనూ మన గ్రామాలకే 

     జాతీయ అవార్డులు


ఇవాళ గాంధీజీ జీవించి ఉంటే తెలంగాణ పల్లెలను చూసి ఎంత సంబురపడిపోయేవారో.. తాను కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాకారమైన ఊళ్లను చూసి ఎంత మురిసిపోయేవారో.. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యాచరణలో దేశానికే రోల్‌మోడల్‌లా విజయవంతమైంది. పల్లెలు అద్దాల్లా మెరుస్తున్నయి. పాతగోడలు, పాడుబడిన బావులు పోయి సీసీ రోడ్లు, సీసీ కెమెరాలు కనపడుతున్నయి. హరితహారం మొక్కలతో పచ్చలహారంగా మారిపోయాయి. వేలాడే విద్యుత్తు తీగల స్థానంలో ఎల్‌ఈడీ లైట్లు మిరుమిట్లు గొలుపుతున్నయి. వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్‌ యార్డులు, రైతు వేదికలు, ఇంటింటికీ మిషన్‌ భగీరథ నల్లాల్లో శుభ్రమైన నీరు. మిషన్‌ కాకతీయతో కళకళలాడుతున్న చెరువులు.. నిజమైన గ్రామస్వరాజ్యాన్ని సాధించి చూపించాయి. మన ఊరు రూపురేఖలు మొత్తం మారడానికి ఏకైక మంత్రం.. సూత్రం పల్లె ప్రగతి.


మన తరువాతే ఎవరైనా..

------------------------------

దేశంలోని గ్రామాలకు కేంద్ర ప్రభుత్వం ఏ పేరుతో అవార్డులను ప్రకటించినా.. అందులో తెలంగాణ పల్లెలు లేకుండా ఉండటం లేదు. ఆదర్శ గ్రామాలు, సాగి గ్రామాలు, ఈ-పంచాయతీ, ఓడీఎఫ్‌ ప్లస్‌ గ్రామాలు, ఈ-పంచాయతీ, రూర్బన్‌ క్లస్టర్‌, ఆన్‌లైన్‌ ఆడిట్‌.. ఇట్లా పేరు ఏదైనా సరే.. తెలంగాణ పంచాయతీలదే పైచేయి. పల్లెల కోసం రాష్ట్ర ప్రభుత్వం గత మూడేండ్లలోనే రూ.17 వేల కోట్లకు పైగా ఖర్చు చేసింది. మౌలిక సదుపాయాలు కల్పించింది. దీంతో ప్రతి పల్లె, ప్రతి గ్రామం పరిశుభ్రంగా మారిపోయింది. ప్రభుత్వం తెచ్చిన కొత్త పంచాయతీరాజ్‌ చట్టం ఈ మార్పునకు జీవం పోసింది. ఈ చట్టం అనేక కార్యక్రమాలను తప్పనిసరిచేసింది. నాటిన మొక్కల్లో 85% బతకాలి. దీని కోసం గ్రీన్‌ బడ్జెట్‌ కింద 10 శాతం నిధులు కేటాయించాలని నిబంధన విధించడంతో ప్రజాప్రతినిధుల జవాబుదారీ పెరిగింది. మొక్కలు బతకకుంటే సర్పంచ్‌లను బాధ్యులను చేయడంతో అలసత్వం తగ్గింది. పల్లెప్రగతి ప్రారంభం నాటి నుంచి అన్ని గ్రామాలకు నగదు రూపంలో.. పథకాల రూపంలో రూ.17,398 కోట్లు అందాయి. వీటిలో అత్యధికంగా రూ.9,560 కోట్లు నేరుగా నగదు రూపంలో ఆర్థిక సంఘం నిధులు గ్రామ పంచాయతీల ఖాతాల్లో జమఅయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు ఇస్తుందో అంతే మొత్తంలో తెలంగాణ ప్రభుత్వం పంచాయతీల ఖాతాల్లో వేస్తున్నది. అంటే రూ.9,560 కోట్లు రాష్ట్రంనుంచి జమ అయ్యాయి. వైకుంఠధామాల నిర్మాణానికి రూ.1,557 కోట్లు, సీసీ రోడ్లకు రూ.2,265 కోట్లు ఖర్చు చేశారు. ట్రాక్టర్లకు రూ.1,270 కోట్లు ఖర్చు చేశారు.


గ్రామానికో కార్యదర్శి..

--------------------------

తెలంగాణ పల్లెల్లో పల్లె ప్రగతి కింద చేపట్టిన కార్యక్రమాలు దేశంలో ఎక్కడా కూడా లేవు. ప్రతి గ్రామానికి ఒక కార్యదర్శిని నియమించడం దేశంలోనే ప్రప్రథమం. గతంలో నాలుగైదు గ్రామాలకు కలిపి ఒక కార్యదర్శి ఉండేవారు. ఇప్పడు మాత్రం ఎవరైనా దీర్ఘకాలిక సెలవులో వెళ్లినా కూడా వెంటనే ఆ స్థానంలో మరొకరితో భర్తీ చేస్తున్నారు. ప్రతి గ్రామానికి ఒక వైకుంఠధామం, డంపింగ్‌ షెడ్డు, నర్సరీ.. ఇలా పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలు కల్పించారు. దేశంలో ఏ ఒక్క పల్లె కూడా తెలంగాణ పల్లెల స్థాయికి దరిదాపుల్లో కూడా లేదు. గ్రామాల్లో అత్యధికులు రైతులే కావడంతో వారికోసం 5 వేల ఎకరాలకు ఒక క్లస్టర్‌ను ఏర్పాటుచేసి 2,597 రైతువేదికలను 515 కోట్లతో నిర్మించారు.


ఓడీఎఫ్‌ ప్లస్‌ రాష్ట్రంగా…

---------------------------

ఓడీఎఫ్‌ ప్లస్‌ రాష్ట్రంగా గుర్తింపు పొందిన తెలంగాణను కేంద్రం అభినందించింది. తెలంగాణ రాష్ట్రం తరహాలోనే అన్ని రాష్ర్టాలు ఓడీఎఫ్‌ ప్లస్‌గా మారాలని సూచించింది. కరోనా ఇప్పటి వరకు మూడు విడతలుగా దేశాన్ని అతలాకుతలం చేసినా.. ఒక్కరికి కూడా కరోనా సోకని ముఖ్రా కే గ్రామాన్ని అధికారులు అభినందించారు. దీనికి కారణం పల్లె ప్రగతే. పారిశుద్ధ్యంతో సీజనల్‌ వ్యాధులు తగ్గాయి.


ఆదాయ వనరుగా ట్రాక్టర్‌….

-----------------------------

ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్‌ నినాదం… ఒక ట్రాక్టర్‌ ఊరి పారిశుద్ధ్య వ్యవస్థనే మార్చేసింది. గ్రామానికి ఆదాయ వనరుగా మారింది. ఒక్కో గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్‌, ట్యాంకర్‌, ట్రాలీ ఉండేవిధంగా సీఎం కేసీఆర్‌ తీసుకొన్న నిర్ణయం పంచాయతీల ముఖ చిత్రాన్ని మార్చేసింది. ఉదయం వేళల్లో పారిశుద్ధ్య పనిచేస్తూ మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు గ్రామంలోని మొక్కలను నీళ్లు పడుతున్నారు. గతంలో మొక్కల సంరక్షణకు ఉపాధి హామీ నిధుల ద్వారా ఒక్కో ట్రిప్పు నీటి ట్యాంకర్‌కు రూ.600 ప్రైవేటు ట్యాంకరు యజమానులకు చెల్లించేవారు. ఇప్పుడు ఒక్కో ట్రిప్పుకు రూ.600 చొప్పున పంచాయతీ ఖాతాలో జమచేస్తున్నారు. 2019 సెప్టెంబర్‌ నుంచి ఇప్పటి వరకు రూ.180 కోట్ల వరకు పంచాయతీల అకౌంట్లో జమ అయ్యాయి.


పల్లెకో ప్రకృతివనం

-------------------------

ప్రతి పల్లెకో ప్రకృతివనం ఏర్పాటైంది. నర్సరీ వచ్చింది. ప్రతి మండలానికి ఒకటి చొప్పున పదెకరాల్లో బృహత్‌ పల్లె ప్రకృతివనాన్ని అందుబాటులోకి తెస్తున్నారు. ప్రకృతి వనాలతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రజలు వాటిల్లో మార్నింగ్‌ వాక్‌ చేస్తున్నారు. ఆక్సిజన్‌తోపాటు మంచి ఆరోగ్యాన్ని సంపాదించుకొంటున్నారు.


వైకుంఠ ధామాలు

-------------------------

చనిపోయిన వ్యక్తి దహన సంస్కారాలకోసం 12,745 వైకుంఠధామాలను నిర్మించారు. వీటికి రూ.1,563.40 కోట్లు ఖర్చయింది. ఇంతకుముందు కులాలవారీగా శ్మశానవాటికలు ఉండేవి. ఇప్పుడు వైకుంఠధామాలతో సమాజంలో సామాజిక మార్పు మొదలైంది. ప్రజల్లో అందరూ సమానమేనన్న భావన పెరిగింది. నిరుపేద, పేద, మధ్య తరగతి, భూమి లేని కుటుంబాల్లో ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు చేసుకోవడానికి ఎలాంటి ఆందోళన లేకుండా వైకుంఠధామాలు ఉపయోగపడుతున్నాయి.


టాప్‌లో అన్నీ మనవే..

----------------------------

సంసద్‌ ఆదర్శ్‌ గ్రామ్‌ యోజన (ఎస్‌ఏజీవై) పథకం అమలులో తెలంగాణ ర్యాంకుల్లో దేశంలో టాప్‌ 20కు 19 మన రాష్ట్ర గ్రామాలే నిలిచాయి. తెలంగాణకు దరిదాపుల్లో ఏ రాష్ట్రం కూడా నిలవలేకపోయింది. మన పల్లెల్లో అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందో, ఇక్కడ పల్లెల్లో వచ్చిన మార్పులను దేశానికి చాటి చెప్పాయి. కేంద్ర ప్రభుత్వమే మన పల్లెల పురోభివృద్ధిని దేశానికి చాటింది. పార్లమెంట్‌ సభ్యులు సంవత్సరానికి ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో, కేంద్ర ప్రభుత్వం ఈ పథకానికి రూపకల్పన చేసింది. 2016లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.


పంచాయతీలకు అవార్డులు

------------------------------

దేశ వ్యాప్తంగా మన పల్లెలకు ప్రతి సంవత్సరం అవార్డులు రావడం ఒక అనవాయితీగా మారింది. దేశానికే మన పల్లెలు ఆదర్శంగా మారడంతో కేంద్ర ప్రభుత్వానికి ఇష్టం ఉన్నా… లేకున్నా రాష్ట్రానికి సంబంధించిన గ్రామాలకు అవార్డులు ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది. కేంద్రం గత నెలలో తెలంగాణకు మొత్తం 19 అవార్డులను ప్రకటించింది. దీన్‌ దయాళ్‌ ఉపాధ్యాయ్‌ పంచాయతీ సశక్తీకరణ్‌ పురస్కార్‌ అవార్డు ఈ అవార్డులను, నగదును ఆయా గ్రామ పంచాయతీలకు అందించింది. జిల్లా కేటగిరిలో సిరిసిల్ల జిల్లా అవార్డు దక్కింది. నాలుగు మండలాలను, 14 పంచాయతీలకు అవార్డులు వచ్చాయి. వీటికి అవార్డులు దక్కడంలో ప్రధానమైన కారణం పల్లె ప్రగతి





Comments

Popular posts from this blog

ఎక్కడిదీ భగవద్గీత, ఎలా పుట్టింది, అసలు మనం ఏ సంవత్సరంలో ఉన్నాం?

తల్లిని మించిన దైవం, గాయత్రిని మించిన దైవం ఎవరు లేరా? గాయత్రి దేవి అంటే ఎవరు..?

లక్ష్మీ కటాక్షం లభించాలంటే ఇలా చేయండి